Untold Story of Manmohan Singh: డాక్టర్ మన్మోహన్ సింగ్..ది అన్‌టోల్డ్ స్టోరీ..! 9 d ago
డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్ నుంచి 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1957-59 ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా చేశారు. 1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని నఫీల్డ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్ లో డి. ఫిల్ చేశారు.
చేపట్టిన వివిధ పదవులు..
1963-65 పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1966-69 ఐరాసలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా ఉన్నారు.
1969-71 దిల్లీ వర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా చేశారు. 1972-76 ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు.
1976-80 రిజర్వు బ్యాంకు డైరెక్టర్, ఐడీబీఐ డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్, ఐబీఆర్ డీ భారత విభాగం గవర్నర్‌గా పని చేసారు. 1982-85 మధ్య ఆర్‌బీఐ గవర్నర్ గా పనిచేశారు. 1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998-2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ 13వ భారత ప్రధానిగా పనిచేశారు. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు సృష్టించారు.
ఆర్థిక రంగంలో కీలకపాత్ర..
1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాదు.. ప్రస్తుతం అధిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు కీలక పాత్రను పోషించారు. 1980లో 6 ప్రైవేట్ రంగ బ్యాంకుల జాతీయకరణలో కీలక పాత్ర పోషించారు. 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
పరిశ్రమ రంగ అభివృద్ధికి ఎదురవుతున్న పలు అవరోధాలను తొలగిస్తూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ఇందులో మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు.
అటోమేటిక్ పద్ధతిలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ అనుమతినిచ్చారు. అంతకుముందు ఈ పరిమితి 40 శాతంగా ఉండేది.
భారత క్యాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెందేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ ఈ) ఏర్పాటుతో పాటు స్మీన్ ఆధారిత ట్రేడింగ్ ను ప్రవేశపెట్టారు. విదేశీ మారకాన్ని (ఫారెక్స్) మెరుగ్గా నిర్వహించేందుకు సంస్కరణలు తెచ్చారు. గ్రామాల్లో కుటుంబాలు, రైతులకు రుణాల లభ్యత పెంచేందుకు పలు సేవలను ప్రారంభించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు (ఆర్ఆర్బీలు) తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.8శాతం) వృద్ధిరేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వహించారు.
2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు.
అందుకున్న అవార్డులు...
1987లో పద్మవిభూషణ్ ప్రదానం చేయబడింది. 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు.
2010లో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్ కు చోటు దక్కింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు.